Cyclone Dana | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా బలపడింది. దీనికి దానాగా నామకరణం చేశారు. పారాదీప్‌కు 560కి.మీ, సాగర్ ద్వీపానికి 630కి.మీ.లు ఖేపుపరాకు 630 కి.మీ. దూరంలో దానా తుఫాను కేంద్రీకృతమై ఉంది. రేపటికి ఇది తీవ్ర తుఫానుగా రూపాంతరంచెందే అవకాశం ఉంది. ప్రస్తుతం గంటకు 18 కిలోమీటర్ల వేగంతో దానా తుఫాను కదులుతోంది. గంటకు 90 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. రేపు అర్ధరాత్రి పూరీ-సాగర్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది.
దానా తుఫాను ప్రభావం ఏపీపై పెద్దగా ఉండకపోవచ్చని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు దీని ప్రభావం ఉంటుందని పేర్కొంది. . ఒడిశాలోని బాలాసోర్, భద్రక్, కేంద్రపాద, బయూర్‌బంజ్, జగత్సింగ్పుర్, పూరి జిల్లాలపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండనున్నది. తుఫాన్ నేపథ్యంలో భారతీయ వైమానిక దళానికి చెందిన రెండు విమానాలు ఎన్డీఆర్ఎప్ దళాలతో సిద్దంగా ఉన్నాయి. బటిండా నుంచి ఐఎల్ 76, ఏఎన్ 32 విమానాలు రిలీఫ్ మెటీరియల్‌తో భువనేశ్వర్ చేరుకున్నాయి. కాగా, తుపాను ప్రభావంతో విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దానా తుఫాన్ (Cylone DANA) ప్రభావంతో వివిధ మార్గాల్లో 41 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. తుఫాను వల్ల ఒడిశా తీరప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో బుధవారం నుంచి ఈ నెల 27 వరకు పలు రైళ్లను ఎక్కడికక్కడే నిలిపివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. రద్దయిన రైళ్లలో భువనేశ్వర్, హౌరా, ఖరగ్‌పూర్, పూరీ, తదితర ప్రాంతాల నుంచి బెంగళూరు, రామేశ్వరం, సికింద్రాబాద్, తిరుపతి , షాలీమార్, మాల్డా, గౌహతి, కన్యాకుమారి, చెన్నై, గోవా తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లే ఎక్కువగా ఉన్నాయి.
బుధవారం రద్దయిన రైళ్లు ఇవే..
సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-హౌరా, సికింద్రాబాద్-హౌరా, సికింద్రాబాద్-మాల్దా, షాలిమార్-హైదరాబాద్ రైళ్లు ఉన్నాయి. ఇక గురువారం వెళ్లనున్న హౌరా-సికింగ్రాబాద్, షాలిమార్-హైదరాబాద్, సిల్చార్-సికాంద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి.