పశ్చిమ గోదావరి : ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టును కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) బృందం సందర్శించింది. ఆదివారం ఉదయం పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్న ముగ్గురు సభ్యుల బృందం.. అక్కడి అప్పర్ కాఫర్‌డ్యామ్‌ను పరిశీలించింది. గోదావరి నదికి వరదలు వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ బృందం ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు వచ్చింది. కాగా, పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌ను అరికట్టి నష్టాలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ రాశారు.
పోలవరం ప్రాజెక్టును ఖయ్యామ్ మహ్మద్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించింది. ఎగువ కాఫర్ డ్యామ్ స్పిల్ వే దిగువ ప్రాంతాలను పరిశీలించింది. కాఫర్ డ్యాం ఎత్తు పనులను మ్యాప్‌ల ద్వారా పరిశీలించిన బృందం సభ్యులు.. ప్రాజెక్టు పరిస్థితి, జరుగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలవరం పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం అందజేసి మౌలిక వసతులు కల్పిస్తున్నది.
ఇటీవల గోదావరికి భారీగా వరద పోటెత్తడంలో ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరింది. దాంతో గ్రామాలు ముంపునకు గురై పంటలు, ఆస్తినష్టం వాటిల్లింది. మరోవైపు బ్యాక్ వాటర్‌పై అధ్యయనం చేయాలని కోరుతూ తెలంగాణ ఈఎన్సీ శనివారం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖ రాశారు. బ్యాక్ వాటర్ ప్రభావంపై స్వతంత్ర సంస్థ ద్వారా అధ్యయనం చేయాలని కోరారు. ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలానికి బ్యాక్ వాటర్ ముప్పు తప్పదని తమ లేఖలో తెలంగాణ ఈఎన్సీ స్పష్టం చేశారు. బ్యాక్ వాటర్ వల్ల వచ్చే వరదలను అరికట్టాలని, నష్టాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఈఎన్సీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని కోరారు.