అమరావతి : తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ పెరిగింది. వారంతపు సెలవు దినం కావడంతో కొండపై భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 24 కంపార్టుమెంట్లు నిండి పోయాయి. టోకెన్లు లేని భక్తులకు 13 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలుగుతుందని వివరించారు. నిన్న స్వామివారిని 78,569 మంది దర్శించుకోగా 28,193 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ.3.54 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.
ఈనెల 12న తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి
తిరుమలలో పవిత్రమైన కార్తీక మాసంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటైన చక్రతీర్థ ముక్కోటిని డిసెంబర్ 12న నిర్వహించనున్నారు. తమిళ కార్తీక మాసం ప్రకారం, ప్రతి సంవత్సరం శుద్ధ ద్వాదశి రోజున చక్ర తీర్థ ముక్కోటి కార్యక్రమం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
పుణ్యక్షేత్రంలో కొలువైన నరసింహ స్వామి, ఆంజనేయ స్వామి విగ్రహాలతో పాటు రాతి కొండపై చెక్కబడిన సుదర్శన చక్రత్తాళ్వార్‌కు టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, అనంతరం ప్రసాదాలు పంపిణీ చేయనున్నట్లు వివరించారు.