Sajjala Ramakrishna Reddy | వైఎస్సార్సీపీ ఏపీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. రాజధాని ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సజ్జల అమరావతి ప్రాంత మహిళల గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని శిరీష తన ఫిర్యాదులో ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు సజ్జల రామకృష్ణారెడ్డిపై పలు సెక్షన్ల కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆరోపణలపై దర్యాప్తు జరుగుతుందని పోలీసులు తెలిపారు. ఈ విషయంలో ఆయనను పోలీసులు విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.