స్టీల్ ప్లాంట్‌పై ఏపీ సీఎం వ్యాఖ్యలను ఖండిస్తున్నానని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. విశాఖ కార్మికులు పనిలేకుండా జీతాలు తీసుకుంటున్నారని అనడం దారుణమని మండిపడ్డారు. చంద్రబాబు మాటలు తెలుగు జాతిని అవమానించడమే అని మండిపడ్డారు. చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు ఎప్పటికీ ప్రభుత్వ రంగానికి వ్యతిరేకమే అనే విషయం మరోసారి రుజువైందని సీపీఐ రామకృష్ణ అన్నారు. ఆయన కేవలం ప్రైవేటు రంగానికి మాత్రమే అనుకూలమనేది ఆయన విశాఖ కార్మికుల వ్యాఖ్యలతో బయటపడిందని అన్నారు. చంద్రబాబు తన వ్యాఖ్యలను భేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు అంటే భారతదేశానికి ఒక బ్రాండ్ అని.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎన్నో అవార్డులను సాధించిందని వివరించారు. వైజాగ్ నగర అభివృద్ధిలో స్టీల్ ప్లాంట్ పాత్ర ఎంతో ఉందని అన్నారు. ఆర్సెలార్ మిట్టల్‌కు సొంత గనులు ఇవ్వాలని కేంద్రమంత్రిని టీడీపీ ఎంపీలు అడుగుతున్నారని తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు ఇవ్వాలని అడగడం మాత్రం చేతకావడం లేదని మండిపడ్డారు.
విద్య, వైద్యం, పర్యాటకాన్ని ప్రైవేటు రంగానికి అప్పగిస్తున్నారని రామకృష్ణ తెలిపారు. అన్ని ప్రైవేటుపరం చేసి, ఎవరిని పరిపాలించాలని అనుకుంటున్నావని చంద్రబాబును ప్రశ్నించారు. సంపద సృష్టి అంటే కార్పొరేట్లకు ఊడిగడం చేయడమేనా అని నిలదీశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా అధికారంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడటం చంద్రబాబు నైజమని విమర్శించారు. చంద్రబాబు వ్యాఖ్యలు తెలుగుజాతిని అమానించినట్లే అని అన్నారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే.. చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని తెలిపారు.