విజయవాడ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, 2024 ఎన్నికలకు సన్నద్ధత వంటి అంశాలపై చర్చించేందుకు సీపీఐ జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశాలు ఢిల్లీలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశాలకు జాతీయ స్థాయి నేతలతో పాటు వివిధ రాష్ట్రాల కార్యదర్శులు సైతం హాజరై మేధోమధనం జరుపుతారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పార్టీ కార్యదర్శులు కూడా పాల్గొనున్నట్లు సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి తెలిపారు. సోమవారం వారు మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో నిర్వహించే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులపై చర్చిస్తామని తెలిపారు.
బీజేపీని, ఎన్డీఏను ఎదుర్కొనేందుకు వేదిక ఏర్పాటు అవసరమున్నదని చాడ వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏపీ పునర్విభజన చట్టం అమలు చేయాల్సింది పోయి, తెలుగు రాష్ట్రాలపై పెత్తనం చేసే ప్రయత్నం చేస్తున్నదని దుయ్యబట్టారు. కృష్ణా జలాల్లో తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన వాటాపై పోరాడాలని.. రెండు రాష్ట్రాల మధ్యనున్న సమస్యను పరిష్కరించాల్సిందిపోయి గెజిట్ ద్వారా కేంద్రం పెత్తనం చేస్తున్నట్లు విమర్శించారు. కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చిన గెజిట్ ను రద్దు చేయాలని పోరాటం చేస్తామన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ప్రజ ప్రయోజనాల కోసం ఉద్యమాలు చేస్తామని చాడ వెంకట రెడ్డి పేర్కొన్నారు.
బీజేపీ, ఎన్డీఏ విధానాలు సరిగ్గా లేవని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆక్షేపించారు. కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ నియంతృత్వ పాలన కొనసాగుతున్నదని.. వీరిని అడ్డుకునేందుకు అన్ని శక్తులు ఒకే వేదికపైకి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం విధానాలు ఉన్నాయని చెప్పారు. ఏపీలో పోలీసులు రాజ్యమేలుతున్నారని, పార్టీ పరమైన సమావేశం పెట్టుకుంటే ఓవరాక్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులను పెట్టి ప్రజా ఉద్యమాలను అణిచివేయాలని చూడటం తగదని రామకృష్ణ చెప్పారు.