Movie Ticket Price | తెలంగాణ తరహాలో ఏపీలో కూడా టికెట్ల ధరల పెంపునకు, బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వద్దని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. పెద్ద హీరోల సినిమాలకు టికెట్ల ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచడం పరిపాటిగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది ప్రేక్షకుల జేబులు కొల్లగొట్టడమేనని అభిప్రాయపడ్డారు. అందుకే టికెట్ ధరలను పెంచడం, బెనిఫిట్ షోలకు అనుమతించే విధానాలను సీపీఐ తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి కె.రామకృష్ణ ఓ లేఖ రాశారు.
పెద్ద హీరోల సినిమాలకు టికెట్ల ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచుతూ, ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతినిస్తూ జీవోలు జారీ చేడయం పరిపాటిగా మారిందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ఇది ప్రేక్షకుల జేబులను కొల్లగొట్టడమే అని అభిప్రాయపడ్డారు. పెద్ద హీరోల సినిమాలను కొన్ని నిర్మాణ సంస్థలు పోటీపడి వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్లతో, ఏళ్ల తరబడి చిత్రీకరిస్తున్నాయని అన్నారు. కనీస సామాజిక స్పృహలేని ఆయా సినిమాల కలెక్షన్ల కోసం టికెట్ ధరలను పెంచాల్సిందిగా, ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతినివ్వాల్సిందిగా నిర్మాణ సంస్థలు ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నాయని పేర్కొన్నారు. సినిమా రంగానికి తలొగ్గి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా టికెట్ల ధరలను విపరీతంగా పెంచుకునేందుకు, బెనిఫిట్ షోలు వేసేందుకు అనుమతించాయని చెప్పారు. ఈ విధానాలను సీపీఐ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు.
పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడంపై రామకృష్ణ విచారం వ్యక్తం చేశారు. రేవతి కుమారుడు శ్రీతేజ ఆపస్మారక స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడని అన్నారు. ఈ దుర్ఘటన తర్వాత ఇకపై తెలంగాణలో సినిమా టికెట్ల ధరలను పెంచబోమని, ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి ఇవ్వబోమని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారని తెలిపారు. తెలంగాణ తరహాలో ఏపీలో కూడా సినిమా టికెట్ల ధరలు పెంచబోమని, ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి ఇవ్వబోమనే ప్రకటన చేయాలని కోరారు.