అమరావతి : తిరుమల లడ్డూ (Tirumala Laddu) పవిత్రతను దెబ్బతీస్తున్న ఏపీ సీఎం వ్యాఖ్యలపై న్యాయస్థానాలు జోక్యం చేసుకుని చంద్రబాబు కుట్రలు బయటపెట్టాలని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ( Ambati Rambabu ) కోరారు. అవసరమైతే సుప్రీంకోర్టు (Supreme Court) స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలు నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు. గుంటూరులోని వైసీపీ కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు అసత్య ఆరోపణలు చేసి మహాపాపం చేశారని మండిపడ్డారు.
ఇంతపెద్ద ఆరోపణపై డీఐజీ స్థాయి అధికారితో విచారణ జరిపిస్తారా అంటూ ప్రశ్నించారు. సీబీఐతో విచారణ జరిపించాలని దేశమంతా కోరుకుంటోందని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధికోసం ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తిరుమల లడ్డూ అపవిత్రం జరిగిందంటే మేం ప్రాయశ్చిత్తం చేస్తాం. తప్పు చేసిన వాళ్లే ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతారని పేర్కొన్నారు. మేం తప్పుచేశామని నిరూపిస్తే పవన్ బూట్లు తుడుస్తామని పేర్కొన్నారు.
లడ్డూ అపవిత్రం అయిందని కొండగట్టు (Kondagattu Temple) ఆంజనేయస్వామి ఆలయంలో పవన్‌కల్యాణ్(Pawan Kalyan) ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. ఆరోపణలను నిరూపించే శక్తి లేక హంగామా చేస్తున్నారని ఆరోపించారు. హిందూ సంప్రదాయాల గురించి చంద్రబాబు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని, తండ్రి చనిపోయినప్పుడు కూడా ఆయన తలనీలాలు ఇవ్వలేదని విమర్శించారు.