Suicide | కడపలో తీవ్ర విషాదం నెలకొంది. తన ఏడాది కుమారుడితో కలిసి భార్యభర్తలు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. కడప నగరానికి చెందిన శ్రీరాములు (35)కు శిరీష (30)తో కొంతకాలం క్రితం పెళ్లయింది. వారికి ఏడాది కుమారుడు రుత్విక్ ఉన్నారు. వీరు ముగ్గురు కూడా తమ నానమ్మతో కలిసి శంకరాపురంలో ఉంటున్నారు. అయితే కొద్దిరోజుల నుంచి భార్యభర్తలు శ్రీరాములు, శిరీష తరచూ గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో సుబ్బమ్మ వారిని మందలించింది. దీంతో మనస్తాపం చెందిన శ్రీరాములు తన భార్య, కొడుకుతో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. మనమడు ఇంటి నుంచి వెళ్లిపోవడంతో దిగులు చెందిన నానమ్మ గుండెపోటుతో మరణించింది.
మరోవైపు ఇంటి నుంచి వెళ్లిన శ్రీరాములు మనస్తాపంతో తన భార్య, కుమారుడితో కలిసి కడప రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. అర్ధరాత్రి 11 గంటల సమయంలో రైల్వే స్టేషన్ సమీపంలోని మూడో నంబర్ ట్రాక్‌పై వస్తున్న గూడ్స్ రైలు కింద పడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. కాగా, భార్యాభర్తలకు ఎందుకు గొడవ అయ్యింది? సుబ్బమ్మ వారిని ఎందుకు మందలించింది.. ఆత్మహత్య చేసుకోవాల్సినంత పరిస్థితి ఏమొచ్చింది.. తదితర వివరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.