తిరుమల : వేంకటరమణుడు కొలువుదీరిన తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈనెల 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు (Vaikunta Dwara Darsanalu) కొనసాగుతుండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి సన్నిధికి చేరుకుంటున్నారు.
నిన్న 71,417 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 19,396 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.42 కోట్ల ఆదాయం (Income) వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
కన్నుల పండువగా గోదా కల్యాణం
టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలోని మైదానంలో బుధవారం రాత్రి కన్నుల పండువగా గోదా కల్యాణం ( Godakalyanam) జరిగింది. శ్రీకృష్ణస్వామి, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులను అలంకరించారు. తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణం, రక్షాబంధనం , అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు.
సర్కారు సంకల్పం, భక్తుల సంకల్పం, మధుపర్క నివేదనం, వస్త్ర సమర్పణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపారు. ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం , అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమాచార్య సంకీర్తనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నారు.