అమరావతి : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ఘనత సాధించడం పట్ల వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) ఇస్రోకు ( ISRO ) అభినందనలు తెలిపారు. ఇస్రో 2024 డిసెంబర్ 30న రాత్రి 10:00:15 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ (స్పేడెక్స్) ప్రయోగాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.
ఈ మిషన్లో భాగంగా శాస్త్రవేత్తలు(Scientists) PSLV-C60 ద్వారా SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) అనే రెండు శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించారు. ఈ శాటిలైట్లను PSLV-C60 విజయవంతగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అనంతరం SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) ఉపగ్రహాలను రోదసిలో డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ ట్విటర్ వేదిక ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలు అంతరిక్షంలో ఉపగ్రహాలను విజయవంతంగా డాకింగ్ చేయడం అద్బుతమైన మైలురాయని కొనియాడారు. ఈ విజయం రాబోయే సంవత్సరాల్లో భారతదేశ ప్రతిష్టాత్మక అంతరిక్ష కార్యకలాపాలకు కీలకమైన ముందడుగు వేస్తుందని ఆకాంక్షించారు.