AP News | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో అన్నమయ్య జిల్లా ఆవులపల్లి గ్రామంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం నెలకొంది. అది కాస్త ముదరడంతో ఇరు వర్గాలు కర్రలతో దాడి చేసుకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. వైఎస్ జగన్ బర్త్ డేను పురస్కరించుకుని వైసీపీ కార్యకర్తలు ఆవులపల్లి గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. అయితే టీడీపీ కార్యకర్తకు చెందిన పొలంలో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం వివాదానికి దారి తీసింది. ఆ ఫ్లెక్సీల ఏర్పాటును టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. అది కాస్త ముదరడంతో ఒకరిపై మరొకరు కర్రలతో దాడి చేసుకున్నారు.
ఈ గొడవలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.