అమరావతి : కులం పేరుతో దూషించిన నటుడు మోహన్‌బాబుపై కేసు నమోదు చేయాలని నాయీ బ్రాహ్మణ, బీసీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. నాగ శ్రీను అనే నాయీ బ్రాహ్మణుడు కొంతకాలంగా మోహన్‌బాబు వద్ద హెయిర్ స్టయిలిస్ట్‌గా పనిచేస్తున్నాడని సంఘాల నాయకులు తెలిపారు. అయితే ఇటీవల సన్ ఆఫ్ ఇండియా చిత్రంపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారన్న కారణంగా నాగశ్రీనును ఇంట్లో పనివాళ్ల ముందు మోకాళ్లపై కూర్చోబెట్టి దుర్భాషలాడారని ఆరోపించారు. రూ.5 లక్షల విలువైన హెయిర్ డ్రెస్సింగ్ సామగ్రిని చోరీ చేశాడని అక్రమ కేసులు బనాయించారన్నారు.
మోహన్‌బాబు వైఖరిని నిరసిస్తూ ఈరోజు ఒంగోలుతో నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు ఆందోళన నిర్వహించారు. మోహన్‌బాబు దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. నాయీ బ్రాహ్మణులకు, బీసీ సమాజానికి మోహన్ బాబు, అతడి కుమారుడు మంచు విష్ణు బహిరంగ క్షమాపణ చెప్పాలని, వారిద్దరిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.