Vidadala Rajini | కూటమి నాయకుల వేధింపులను ఎదుర్కొంటున్న వైసీపీ కార్యకర్తల రక్షణ కోసం వైఎస్ జగన్ తీసుకొచ్చిన డిజిటల్ బుక్‌లో ఇప్పుడు సొంత నేతలపైనే ఫిర్యాదులు అందుతున్నాయి. మాజీ మంత్రి విడదల రజినీపై తాజాగా డిజిటల్ బుక్‌లో ఫిర్యాదు అందింది. నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఆమెపై ఆదివారం ఫిర్యాదు చేశారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని నవతరం పార్టీ కార్యాలయం, తన ఇంటిపై 2022లో విడదల రజినీ దాడి చేయించారని రావు సుబ్రహ్మణ్యం ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. విడదల రజినీపై చర్యలు తీసుకొని, తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయాన్ని రావు సుబ్రహ్మణ్యం వెల్లడించారు. మాజీ మంత్రి విడదల రజినీపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు డిజిటల్ బుక్ యాప్ ద్వారా ఫిర్యాదు చేశానని తెలిపారు. ఈ ఫిర్యాదుపై నాకు న్యాయం చేస్తే జగన్ చెప్పినట్లు వైసీపీ కార్యకర్తలకూ న్యాయం జరుగుతుందనే నమ్మకం కలుగుతుందని వ్యాఖ్యానించారు. డిజిటల్ బుక్యాప్లో మాజీ మంత్రిపై ఫిర్యాదు చేసిన తర్వాత వచ్చిన టికెట్‌ను కూడా సుబ్రహ్మణ్యం మీడియాకు చూపించారు.