Roja Selvamani | మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి రోజా సెల్వమణిపై కర్నూలు పోలీసులకు దళిత సంఘాలు ఫిర్యాదు చేశాయి. 2023 ఫిబ్రవరిలో మంత్రిగా ఉన్న సమయంలో బాపట్ల సూర్యలంక బీచ్‌లో దళితులను అవమానించారంటూ కర్నూలు త్రీటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాయి.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న రోజా.. 2023 ఫిబ్రవరిలో బాపట్లలోని సూర్యలంక బీచ్‌ను సందర్శించారు. ఆ సమయంలో బీచ్‌లో రోజా సరదాగా తిరిగారు. సముద్రపు ఒడ్డునే తన చెప్పులను విడిచిన రోజా.. కాసేపు బీచ్‌లో, నీటిలో గడిపారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పర్యాటక శాఖ అధికారి ఒకరు.. రోజా చెప్పులను మోసుకుని వచ్చారు. ఇది అప్పట్లో వివాదాస్పదమైంది.
అధికారి ఒకరు రోజా చెప్పులు మోస్తూ కనిపించిన వీడియో వైరల్ కావడంతో ప్రతిపక్షాలు కూడా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపైనే తాజాగా కర్నూలుకు చెందిన దళిత సంఘ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.