అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు ఏపీ సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న 896 మంది ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనున్నది. ఈ కారుణ్య నియామకాలను గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్టీసీ, జిల్లా కలెక్టర్ల పరిధిలో చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కారుణ్య నియామకాలను చేపట్టాలని ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
సర్వీసులో ఉండి చనిపోయిన ఉద్యోగుల విషయాన్ని ఎన్ఎంయూ, ఈయూ, వైఎస్ఆర్ పీటీడీ అసోసియేషన్, ఎస్‌డబ్ల్యూఎఫ్ నేతలు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు వీరి విజ్ఞప్తిని మన్నించిన ప్రభుత్వం ఈ మేరకు 2016 నుంచి పెండింగ్‌లో ఉన్న 896 కారుణ్య నియామకాలను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నది. కారుణ్య నియామకాలు జరిపే వారి పేర్ల జాబితాను ఆర్టీసీ ఎండీ సంబంధిత జిల్లా కలెక్టర్లకు పంపి, గ్రామ, వార్డు సెక్రటరీ ఉద్యోగాల్లో ఉన్న వారిని గుర్తించి నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మిగిలిన అభ్యర్థుల జాబితాను ఆర్టీసీ ఎండీకి పంపి వారి అర్హతల ఆధారంగా ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు, కార్మికులుగా నియమించనున్నారు. ఇంకా మిగిలి ఉంటే ఆ జాబితాను తిరిగి సంబంధిత కలెక్టర్లకు పంపుతారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. విలీనానికి ముందు 896 మంది ఉద్యోగులు సర్వీసులో ఉండగా ప్రాణాలు కోల్పోయారు. కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీఎస్ ఆర్టీసీలోని వివిధ యూనియన్ల నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలపై సానుకూల నిర్ణయం తీసుకున్నందుకు సీఎం జగన్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.