Cyclone Montha | మొంథా తుపాన్ దృష్ట్యా రాబోయే నాలుగు రోజులు చాలా కీలకమైనవని ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. కాచి వడబోసిన నీటినే తాగాలన్నారు.
మొంథా తుపాన్ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలతో ప్రాణ, ఆస్తి నష్టం భారీగా జరగకుండా అప్రమత్తం చేశామని సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆర్టీజీఎస్లో కూర్చొని తుపాన్ పరిస్థితులను చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షించారని.. అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఢిల్లీలో కంట్రోల్ రూం ఏర్పాటు చేచసి ఎప్పటికప్పుడు సహకారం అందించారని తెలిపారు. దీనివల్ల తుపాన్ విపత్తు నుంచి ఏపీని కాపాడుకోగలిగామని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 2555 మంది గర్భిణులను ఆస్పత్రులకు తరలించి వైద్యం అందించామని మంత్రి తెలిపారు. తుపాన్ ప్రాంతాల్లో మందుల కొరత లేకుండా వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో క్లోరినేషన్ చేస్తూ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో 671 అంబులెన్స్‌లు, 885 సంచార వాహనాలు (104) అందుబాటులో ఉంచామని చెప్పారు.
కాగా, మొంథా తుపాన్ వల్ల జరిగిన ప్రాథమిక నష్టాన్ని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రాథమికంగా 249 మండలాలు, 48 మున్సిపాలిటీల్లో 18 లక్షల మందిపై తుపాన్ ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది. వరదల కారణంగా ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలతో తుపాన్ నష్టం అంచనా ప్రక్రియను అధికారులు కొనసాగిస్తున్నారు. కాగా, మొంథా తుపాన్ కారణంగా భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో వరి, ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పంట నష్టంపై అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. జిల్లాల్లో భారీగా పంటలు దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చారు. 10 వేల హెక్టార్లలో వరిపంట దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. 5 వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం కలిగినట్లు గుర్తించారు. రెండు వేల ఎకరాల్లో రొయ్యల చెరువులు నీట మునిగాయని అధికారులు తెలిపారు. కాగా, రెండు రోజుల్లో ఈ ప్రాథమిక నివేదికను పూర్తి చేసి ఏపీ ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. ప్రాథమిక అంచనాలు వచ్చాక కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించనుంది.