CM Ramesh | పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు బీజేపీలో చేరడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే వారు తిరుగుబాటు చేసి, కాషాయ గూటికి చేరేలా ప్రోత్సహించడం వెనుక ఏపీకి చెందిన బీజేపీ నేత సీఎం రమేశ్ చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరినైనా బీజేపీలో చేరేలా ఒప్పించేందుకు తనకు రెండు గంటలు చాలని వ్యాఖ్యానించారు.
ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం రమేశ్ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తన పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రజలను ఒప్పించడమే నా నైపుణ్యం. కేవలం రెండు గంటల సమయం ఇస్తే చాలు. ఎవరినైనా సరే బీజేపీలో చేరేలా ఒప్పించగలను. ‘ అని వ్యాఖ్యానించారు.
తనకు చాలా కాలంగా తృణమూల్ ఎంపీలు తెలుసని.. పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని క్యాంటీన్లో తరచూ కలవడం వల్ల వారితో ఒక బంధం ఏర్పడిందని తెలిపారు. 2020లో దుబాయి, హైదరాబాద్‌లో జరిగిన తన కుమారుడి వివాహ వేడుకకు సైతం వారు హాజరయ్యారని గుర్తుచేశారు. అప్పట్లో మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్థురాలిగా ఉండి, ఇప్పుడు తిరుగుబాటు చేసిన శతాబ్ది రాయ్ కూడా ఆ పెళ్లి వేడుకలకు హాజరు కావడం గమనార్హం. తృణమూల్ ఎంపీలను ఆకర్షించేందుకు డబ్బు పంపిణీ జరగలేదని, పదవులు ఇస్తామంటూ ప్రలోభ పెట్టలేదని స్పష్టం చేశారు.
గతంలో అస్సోం రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ చీఫ్ విప్ భువనేశ్వర్ కలితా రాత్రికి రాత్రే బీజేపీలో చేరడంలోనూ సీఎం రమేశ్ పాత్ర ఉందని వార్తలు వచ్చాయి. అమిత్ షా ఆదేశాల మేరకు ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఎన్నికలోనూ బీజేపీ సభ్యులను గెలిపించేందుకు సీఎం రమేశ్ తీవ్రంగా కృషి చేశారని సమాచారం.