అమరావతి : ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారుల హెచ్చరికల మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandra Babu) ఆదివారం ఆయా ఆయా జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ (Teleconference) నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాలపై కలెక్టర్లను, అధికారులను అప్రమత్తం చేసి ప్రస్తుత పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.
సోమవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు( Heavy Rains) పడే అవకాశముందని, కాలువలు, చెరువులు, డ్రెయిన్లకు గండ్లు పడకుండా చూసుకోవాలని ఆదేశించారు. వరద, భారీ వర్షాలపై ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజ్లు పంపాలని సూచించారు. ఆహారం, తాగునీరు. వైద్య శిబిరాల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలని, ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణనష్టం లేకుండా చేసుకోవాలని తెలిపారు.
వరదప్రాంత ప్రజలకు నచ్చజెప్పి పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. నాగావళి, వంశధారకు వరద పెరిగే అవకాశముందని పేర్కొన్నారు . జిల్లా స్థాయిలో చేస్తున్న పనులకు తక్షణం నిధులు విడుదల చేస్తామన్నారు.
విశాఖ కలెక్టరేట్లో సైక్లోన్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు
విశాఖ కలెక్టరేట్లో సైక్లోన్ కంట్రోల్ రూమ్లను అధికారులు ఏర్పాటు చేశారు. విశాఖ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 0891-2590100, 0891-2590102, పోలీసు కంట్రోల్ రూమ్ 0891-2565454, డయల్ 100, 112 కు ఫోన్ చేయాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విశాఖ జిల్లాలోని పలు మండలాల్లోనూ కంట్రోలు రూమ్లు ప్రారంభించారు.