అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandra Babu) దీపం లబ్ధిదారు ఇంట్లో స్వయంగా టీ తయారు చేసి మంత్రులకు అందించి, తాను తాగారు. దీపం-2 పథకంలో భాగంగా శ్రీకాకుళం(Srikakulam) జిల్లా ఈదుపురంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఆయన వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు( Rammohan Naidu), రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్(Nadendla Manohar), అచ్చెనాయుడు (Acchennaidu) ఉన్నారు.
ఈ సందర్భంగా ఈదుపురంలో లబ్ధిదారు శాంతమ్మ ఇంటికెళ్లి సిలిండర్ (Cylinder) అందించారు. స్వయంగా గ్యాస్ స్టవ్ సిలిండర్ బిగించడంతో పాటు పొయ్యి వెలిగించి టీ తయారు చేసి తాగారు. టీ తాగినందుకు డబ్బులివ్వాలని, కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని నవ్విస్తూ కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడుకి సూచించారు. ఈ సందర్భంగా లబ్ధిదారు శాంతమ్మ ఆర్థిక, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
మరో ఇంట్లోకి వెళ్లి లబ్ధిదారురాలికి పింఛన్‌ను అందజేశారు. ఇంట్లో ఆరోగ్య పరిస్థితిపై వాకాబు చేసి తక్షణమే రెండు లక్షల రూపాయలు అందజేసి ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా పింఛన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు వారివారి నియోజకవర్గాల్లో అందజేశారు.