CM Chandrababu Naidu | విశాఖ జిల్లా సింహాచలం అప్పన్నస్వామి ఆలయం వద్ద అపశ్రుతి చోటు చేసుకున్నది. దర్శనానికి బారులు తీరిన భక్తులపై గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో ఎస్టీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందడం నన్ను కలచి చేసిందన్నారు. భారీ వర్షాల కారణంగా గోడ కూలడం తో జరిగిన ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అక్కడి పరిస్థితి పై జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడినట్లు తెలిపారు. గాయపడిన వారికి చికిత్స అందించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ‘ఎక్స్’పోస్ట్‌లో పేర్కొన్నారు.