Child Marriage | పల్నాడు జిల్లాలో పెద్దల సమక్షంలో ఓ బాల్యవివాహం జరిగింది. దీనిపై పల్నాడు పోలీసులు, చైల్ వెల్ఫేర్ అధికారులు కన్నెర్ర జేశారు. పెళ్లి కొడుకుతో పాటు ఇరువురి తల్లిదండ్రులు, పురోహితుడు, మండపం నిర్వాహకుడు, ఫొటోగ్రాఫర్ సహా 14 మందిపై కేసు నమోదు చేశారు.
పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కొండూరుకు చెందిన ఆంజనేయులు, పద్మ కుమార్తెకు 16 ఏళ్లు. ఐదో తరగతి వరకు చదువుకున్న బాలిక తల్లిదండ్రులతో కలిసి కూలీ పనులు చేసుకుంటుంది. ఈ క్రమంలో తమ కుమార్తెకు వివాహం చేయాలని నిర్ణయించుకున్న తల్లిదండ్రులు సత్తెనపల్లి దోబి ఘాట్‌కు చెందిన నాగ గోపీతో వివాహం నిశ్చయించారు. ఆగస్టు 3వ తేదీన పెద్దలు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా పెళ్లి జరిపించారు. అయితే బాలికకు ఇంకా 18 ఏళ్లు నిండకపోవడంతో, మైనర్‌కు వివాహం చేసినట్లు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు అందింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. బాలిక బర్త్ సర్టిఫికెట్ పరిశీలించి ఆమె మైనర్ అని నిర్ధారించారు. 18 ఏళ్ల వయసు నిండకుండా వివాహం జరిపించడంతో పెళ్లి కొడుకు నాగగోపీ, అతని తల్లిదండ్రులు బాలయ్య, చిలకమ్మలతో పాటు మైనర్ బాలిక తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా పెళ్లి జరిపించిన పురోహితుడు, ఫొటోలు తీసిన ఫొటోగ్రాఫర్, వివాహం జరిగిన మండపం నిర్వాహకుడు సహా 14 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక మైనర్ బాలికను అదుపులోకి తీసుకుని శిశు సంక్షేమ శాఖ హోమ్‌కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా మైనర్ వివాహాలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బాల్య వివాహం.. 14 మందిపై కేసు..
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆగస్టు 3న పెద్దల సమక్షంలో బాల్య వివాహం
చైల్డ్ వెల్ఫేర్ కేర్ సంస్థకు సమాచారం ఇచ్చిన స్థానికులు
వధూవరుల తల్లిదండ్రులు, పురోహితుడు, మండపం నిర్వాహకుడు, ఫోటో గ్రాఫర్ పై కేసు నమోదు
మైనర్… pic.twitter.com/bITktJCoiT
— BIG TV Breaking News (@bigtvtelugu) October 1, 2025