TG Venkatesh | శ్రీశైలం అక్టోబర్ 15: శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు మహా భక్తుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు అమ్మవారు శక్తిస్వరూపిణిగా సాక్షాత్కారమై ఖడ్గం ప్రసాదించిన పవిత్ర స్థలం నేడు శివాజీ స్పూర్తి కేంద్రంగా యాత్రికులకు ఆదర్శనీయమైందని శివాజీ స్పూర్తి కేంద్రం చైర్మన్ టీజీ వెంకటేశ్ అన్నారు.
మల్లికార్జున అన్న సత్ర సంఘం ఆధ్వర్యంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని పర్యటనతో శ్రీశైల క్షేత్రం ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా ఎంతో అభివృద్ధిని సంతరించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా శ్రీశైలానికి వచ్చే యాత్రికులకు అందించే వసతులను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేందుకు తగిన మాస్టర్‌ప్లాన్ అమలుకు ప్రధాని అమోదం తెలుపనున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ట్రస్ బోర్డ్ చైర్మన్ రమేశ్ నాయుడు, టీజీ లక్ష్మీ వెంకటేశ్ భవన్ అధ్యక్ష కార్యదర్శులు మిడిదొడ్డి శ్యాంసుందర్, బలుస శ్రీరాములు, రామకృష్ణ, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.