తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఓ సంస్థ ఖరీదైన కానుకలు సమర్పించారు. చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ సుమారు రూ.2.4 కోట్ల విలువైన బంగారు శంకు చక్రాలను అందించింది. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపలో కంపెనీ ప్రతిధులు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి వీటిని అందజేశారు. అనంతరం ఏఈవో వెంకయ్య చౌదరి దాతల్ని శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారికి చెన్నై భక్తులు అందించిన బంగారు శంఖం, చక్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2.5 కిలోల బంగారంతో తయారుచేసిన ఈ ఆభరణాలను ఆలయంలో స్వామివారికి అలంకరించనున్నారు.
కాగా, తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు మార్గంలో ఏనుగులు కలకలం సృష్టించాయి. పంపు హౌస్ వద్ద 11 ఏనుగులతో కూడిన గుంపు ఉన్నట్లు డ్రోన్ కెమెరాతో గుర్తించారు. సమీపంలోని పంట పొలాలను అవి ధ్వంసం చేశాయి. దీంతో వినాయకస్వామి చెక్ పాయింట్ వద్ద భక్తులను అధికారులు గంటపాటు నిలిపివేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ, టీటీడీ ఫారెస్ట్, విజిలెన్స్ అధికారులు ఏనుగులను అడవిలోకి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది భక్తులను గుంపులుగా శ్రీవారి మెట్టు వద్దకు తరలిస్తున్నారు.