Srisailam | శ్రీశైలం దేవస్థానం ఇన్చార్జి ఈవోగా చంద్రశేఖరరెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం పరిపాలన భవనంలో అధికార బాధ్యతలు తీసుకున్నారు. ఈవోగా పని చేసిన పెద్దిరాజును ప్రభుత్వం బదిలీ చేసింది. మాతృసంస్థలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. శ్రీశైలం ఇన్చార్జి ఈఓగా అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డిని నియమిస్తూ ఆదేశాలు చేసింది. ఈ క్రమంలోనే ఆయన ఇన్చార్జి ఈవోగా పదవీ బాధ్యతలు చేపట్టగా. అర్చకస్వాములు, వేదపండితులు ఆశీర్వదించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ అన్ని విభాగాలు కూడా కార్తీక మాసం ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా భక్తులకు వసతి, మంచినీటి సరఫరా, సౌకర్యవంతమైన దర్శనం, క్యూలైన్ల నిర్వహణ, రద్దీ క్రమబద్ధీకరణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వాహనాల పార్కింగ్, పారిశుధ్యం, లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి, కార్తీక పౌర్ణమి రోజున, జ్వాలాతోరణం, పుణ్యనదీ హారతి కార్యక్రమాలు, ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు.