అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ( Chandrababu) విడుదల చేస్తున్న శ్వేత పత్రాల్లో అన్ని అసత్యాలే ఉంటున్నాయని, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను బద్నాం చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి(Former minister Kakani) ఆరోపించారు. మంగళవారం చంద్రబాబు విద్యుత్ రంగంపై విడుదల చేసిన శ్వేతపత్రం (White Paper) పై ఆయన స్పందించారు.
చంద్రబాబు పరిపాలనలోనే విద్యుత్ రంగం(Power Sector) కుదేలు అయ్యిందని విమర్శించారు. బాబు అధికారం కోల్పోయిన నాటికి ఏపీ విద్యుత్ రంగంలో రూ. 86, 215 కోట్లు అప్పు ఉందని వెల్లడించారు. 2014-19 వరకు సగటు వృద్ది రేటు కేవలం 1.9 శాతం మాత్రమేనని పేర్కొన్నారు. జగన్ (YS Jagan) హయాంలో 4.7 శాతం వృద్ధిరేటు సాధించిందని, జాతీయ సగటు కంటే ఇది అధికమని అన్నారు.
గతంలో చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా విద్యుత్ ఒప్పందాలను చేసుకున్నారని ఆరోపించారు. అంతటా సోలార్ విద్యుత్ ధరలు తగ్గితే రాష్ట్రంలో మాత్రం యూనిట్‌ను ఏడు రూపాయాలకు కొనుగోలు చేసుకున్నారని, దీని వల్ల విద్యుత్ రంగానికి ఎంతో నష్టం జరిగిందని అన్నారు.
రైతులకు సబ్సిడీ (Subcidy) బకాయిలు చెల్లించకపోవడంతో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని చెల్లించారని స్పష్టం చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు అంశాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదని కాకాణి ప్రశ్నించారు. ట్రూఅప్ ఛార్జీలు చంద్రబాబు హయాంలోనే వచ్చాయని విమర్శించారు.