అమరావతి : ఏపీలోని గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త, దళితుడు మందా సాల్మన్ ( Salman ) హత్యకు గురయ్యాడు. ఈ ఘటనను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి( YS Jagan ) తీవ్రంగా ఖండిస్తూ ట్వీట్ చేశారు. రాజకీయ కక్షలతో ఇంకా ఎంతమంది ప్రాణాలను బలితీసుకుంటారని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్‌బుక్ రాజ్యాంగం, పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. హింసారాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబు ( Chandra Babu ) ను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరని, ఇలాంటి ఘటనలకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడ్డానికి సాల్మన్ సొంత గ్రామానికి వెళ్తే ఇనుప రాడ్లతో కొట్టి దారుణ హత్యచేసి, సాల్మన్‌పైనే తప్పుడు ఫిర్యాదు చేయడం దారుణమని అన్నారు. ఇలాంటి దారుణాలు చేయడానికా మీరు అధికారంలోకి వచ్చిందా అంటూ మండిపడాడరు. ఈ ఘటన ముమ్మాటికీ వైయస్సార్సీపీని భయపెట్టడానికి, కట్టడిచేయడానికి మీరు, మీ పార్టీవారి ద్వారా, కొంతమంది పోలీసులు ద్వారా చేస్తున్న చేయిస్తున్న రాజకీయ హింసాత్మక దాడుల పరంపరలో భాగమేనని ఆరోపించారు.
ఎమ్మెల్యే, పోలీసుల బెదిరింపులతో పిన్నెల్లి గ్రామం నుంచి వందలకొద్దీ వైయస్సార్ కార్యకర్తల కుటుంబాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని వెల్లడించారు. పౌరులకు రక్షణ కల్పించడం, వారు స్వేచ్ఛగా తమ జీవితాలను గడిపేలా చూడ్డం మీ బాధ్యత కాదా? అంటూ నిలదీశారు.
ముఖ్యమంత్రిగా ఉండి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఏది విత్తుతారో అదే రేపు పండుతుందన్నది ఎప్పుడూ మరిచిపోకూడదు. టీడీపీవారి చేతిలో హత్యకు గురైన సాల్మన్ కుటుంబానికి వైయస్సార్సీపీ అండగా ఉంటూ ఆదుకుంటుందని అన్నారు.