అమరావతి : చంద్రబాబు ( Chandra Babu) ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఆడవారిని వేధించడం అలవాటని, వ్యక్తత్వ హననంలో చంద్రబాబు సిద్ధహస్తుడని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా ( Roja Selvamani ) ఆరోపించారు. శనివారం ఆమె నగరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఏపీలో వైఎస్ జగన్, వైసీపీ నాయకులపై దారుణంగా పోస్టులు పెడుతున్న టీడీపీ సోషల్ మీడియా (TDP Social Media) కార్యకర్తలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. వైసీపీ (YCP) నాయకులను, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి చిత్రహింసలు పెడుతున్నారని విమర్శించారు. ఆడపిల్లలకు, మహిళలకు కూటమి ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందని దుయ్యబట్టారు.
మహిళ హోంమంత్రిగా ఉన్నప్పటికీ రక్షణ లేకుండా పోయిందని, అత్యాచారాలు, దాడులు జరుగుతుంటే ఆమె ఏం చేస్తున్నారని నిలదీశారు. ఆమెకు మహిళలంటే ప్రేమ, గౌరవం లేదని పేర్కొన్నారు. విశాఖలో మంత్రి అనిత నివాసానికి సమీపంలో గంజాయి సాగు చేయడం సిగ్గు చేటని అన్నారు. మంత్రుల మాటలు కోటలు దాటుతున్నాయి. చేతలు గడప దాటడం లేదని అన్నారు.