అమరావతి : గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రణాళికాబద్ధమైన దాడుల్లో అలసత్వం తగదని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు సోమవారం రాసిన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చకొట్టే కుట్రలో భాగంగానే ఈ దాడులు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని వైసీపీ జడ్పీటీసీ యలమంచ ధ్వంసం చేశారని చంద్రబాబు ఆరోపించారు. అధికార వైసీపీ నాయకుల అండదండలతోనే దాడులు కొనసాగుతున్నాయని అన్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు. మహనీయుల విగ్రహాల ధ్వంసంపై శాంతియుత నిరసన తెలిపితే టీడీపీ శ్రేణులను అదుపులోకి తీసుకుంటారా.. అని ప్రశ్నించారు. పోలీసులు గట్టి చర్యలు తీసుకుని విధ్వంసక ఘటనలు పునరావృతం కాకుండా, ఫిర్యాదులపై విచారణ జరిపి దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుందని అనుమానం వ్యక్తం చేశారు. విగ్రహాల ధ్వంసంపై టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేశ్ , నాయకులు యనమాల రామకృష్ణుడు, సోమిరెడ్డి, చినరాజప్ప ,నిమ్మల రామానాయుడు తీవ్రంగా ఖండించారు.