అమరావతి : ఏపీలో వైసీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయన్న కక్షతో చంద్రబాబు వరదలను రాజకీయం కోసం ఉపయోగించుకుంటున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఆరోపించారు. వైఎస్ జగన్(YS Jagan) అంటే చంద్రబాబుకు భయమని పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరూ ఊహించని విధంగా వరదలు వస్తే వైసీపీ నిర్లక్ష్యం వల్లే వచ్చాయని ఆరోపించడం దారుణమని అన్నారు.
ప్రభుత్వానికి వరదలపై సమాచారం ఉన్నాగాని ముందస్తు చర్యలు తీసుకోక పోవడం వల్లే విజయవాడ(Vijayawada) కు విపత్తు వచ్చిందని పేర్కొన్నారు. వరదల వల్ల అనేక బోట్లు ప్రకాశం బ్యారేజీ(Prakasam Barrage) లో కొట్టుకుపోయాయని వివరించారు. టూరిజం బోట్లు కూడా ప్రవాహంలోకి కొట్టుకు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.
వైసీపీ నాయకులు నాలుగు భారీ పడవలను వదిలి గేట్లను దెబ్బతీయాలని కుట్ర పన్నారని ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండించారు. బోట్ల కేసులో అరెస్టయిన కోమటి రామ్మోహన్, ఉషాద్రి టీడీపీ నేతలకు సన్నిహితులని ఆరోపించారు.