అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) ఎంతటి నీచానికైనా వెనుకాడడని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి (Lakshmi Parvati ) ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్వార్థం కోసం ఎవరినైనా చివరకు దేవుడినైనా రాజకీయాల కోసం ఉపయోగించుకుంటాడని విమర్శించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ లడ్డూ తయారీలో ఎలాంటి కల్తీ నెయ్యి వాడలేదని పేర్కొన్నారు.
చంద్రబాబు హయాంలో నెయ్యిలో కల్తీ జరిగితే వైఎస్ జగన్‌పై నింద వేస్తున్నారని విమర్శించారు. పవిత్రమైన తిరుమల లడ్డూ తయారిలో జంతువుల నూనె కలిసిందని స్వయాన ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేసి తిరుమల గోవిందుడికి కళంకం తీసుకువచ్చారని ఆరోపించారు. నేడు దేవుడి పేరుతో ఆటలాడుతున్నాడని, అతడికి నిలువెల్లా విషమే ఉంటుందని విమర్శించారు.
చంద్రబాబువి డైవర్షన్ పాలిటిక్స్ : మాజీ మంత్రి
చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్షలు చేశారు. చంద్రబాబు చేసిన అపరాధాన్ని క్షమించమని పవన్‌కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సూచించారు. టీటీడీ రిపోర్టు టీడీపీ ఆఫీసుకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కూటమి నాయకులు ప్రభుత్వ ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు.