అమరావతి : సాధ్యం కాని హామీలతో ఏపీ ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) మోసం చేస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) ఆరోపించారు. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో చంద్రబాబు దిట్టని తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి వైఎస్ జగన్‌రెడ్డిపై (YS Jagan) విమర్షలు చేస్తున్నారని మండి పడ్డారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి వైఫల్యాలను ఎండగట్టారు. వైసీపీ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లు అప్పు చేశారని తప్పుడు ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి మరో రూ. 2 లక్షల అప్పుల భారం పడేవిధంగా ఎలా హామీలిచ్చారని ప్రశ్నించారు. ప్రజలకిచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయడం లేదని ఆరోపించారు.
రాష్ట్రంలో రూ. 4 వేల వరకు పింఛన్‌ను(Pensions) పెంచి 3 లక్షల మంది లబ్దిదారులను తొలగించారని పేర్కొన్నారు. స్మార్ట్ మీటర్ల పేరు చెప్పి సర్‌ఛార్జీల పేరిట ప్రజలపై భారం వేయనున్నారని ఆరోపించారు. నవంబర్ 15 నుంచి యూనిట్ రూపాయి 58 పైసలు పెంచేందుకు బాదుడు సిద్ధం చేశారని విమర్శించారు. సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. సూపర్సిక్స్లను అమలు చేయడం లేదని విమర్శించారు.