అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఐదేండ్లుగా నిలిచిపోయిన అన్న క్యాంటీన్లను( Anna canteens) గురువారం నుంచి ప్రారంభించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వంద క్యాంటీన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu) కృష్ణాజిల్లా గుడివాడ (Gudivada)లో అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి(Bhuvaneshwari), మంత్రులు కొల్లు రవీంద్ర, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొని పలువురికి భోజనం వడ్డించారు. అనంతరం పేదలతో కలిసి భోజనం చేశారు. అన్న క్యాంటీన్లలో రూ.5 కే భోజనం, అల్పాహారాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేశారు. 2014-19 మధ్య టీడీపీ హయాంలో నిర్వహించిన అన్న క్యాంటీన్లను గత వైసీపీ ప్రభుత్వం(YCP Government) మూసివేసింది.
అధికారంలోకి వచ్చాక తిరిగి అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్‌డీయు ప్రభుత్వం తాజాగా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. 203 క్యాంటీన్లను ఒకేసారి ప్రారంభించాలని మొదట భావించినా భవన నిర్మాణ పనులు పూర్తి కానందున తొలి విడతలో 100 క్యాంటీన్లను ప్రారంభించారు. జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు అన్న క్యాంటీన్లు ప్రారంభించారు.