అమరావతి : నీతి ఆయోగ్ సమావేశంలో దేశం అభివృద్ధి చెందిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandra Babu) చేసిన వ్యాఖ్యలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(CPI Secretary Ramakrishna) తప్పుబట్టారు. అసలు దేశం ఏ రంగంలో అభివృద్ధి చెందిందో చంద్రబాబు ప్రజకు సమాదానం చెప్పాలని ప్రశ్నించారు.
కేంద్ర విధానాల వల్ల దేశంలో 1.2 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు(Farmers Suicide) చేసుకుంటే అభివృద్ధి అని ఎలా చెపుతారని నిలదీశారు. 40 శాతం మంది గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్న విషయాన్ని పరిగణనలలోకి తీసుకోవాలని సూచించారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక పేదరికంలో భారత్ ప్రథమ స్థానం వచ్చిందని ఆరోపించారు. రాష్ట్రంలో అప్పులపై అధికార, ప్రతిపక్షాలకు చెందిన నాయకులు భిన్నంగా ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేస్తున్న శ్వేతపత్రాలు , మాజీ సీఎం వైఎస్ జగన్ వివరిస్తున్న ప్రకటనలతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్యాక్రాంతమైన భూములపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలువనున్నట్లు వెల్లడించారు.