Chandrababu Naidu | స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి ఈ నెల 22 వరకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు అనంతరం చంద్రబాబు నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనను పోలీసులు రాజమండ్రి జైలుకు తరలించారు. అయితే, ఉమ్మడి ఏపీలో జైలుకు వెళ్తున్న తొలి మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నిలిచారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు ఆదివారం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అలాగే అధికారులు కోర్టుకు రిమాండ్ రిపోర్టును సైతం సమర్పించారు. రిపోర్టులో చంద్రబాబును ఏ37గా పేర్కొనగా.. కుంభకోణంలో ముఖ్యమైన కుట్రదారని సీఐడీ పేర్కొంది.
ఆ తర్వాత కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు తరుఫున సుప్రీంకోర్ట్ సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించగా.. సీఐడీ తరుఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి బృందం హాజరైంది. ఉదయం 8 గంటలకు తర్వాత ప్రారంభమైన వాదనలు.. మధ్యాహ్నం 2.30 గంటల వరకు కొనసాగాయి. ఆ తర్వాత ఈ కేసులో కోర్టుకు సీఐడీ సమర్పించిన రిమాండ్ రిపోర్టుపై ఇరుపక్షాలు న్యాయవాదులు సుదీర్ఘంగా తమ వాదనలు వినిపించారు. ఇరు వైపులా వాదనలు విన్న న్యాయమూర్తి.. చంద్రబాబుకు రిమాండ్ విధించారు. అయితే, చంద్రబాబు తరఫున న్యాయవాదులు చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించలేదు. గవర్నర్ పర్మిషన్ అవసరమన్న వాదనలను కోర్టు అంగీకరించలేదు. కేసులో ఆధారాలున్నాయని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
కోర్టు తీర్పు తర్వాత.. న్యాయవాదులు రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. గృహనిర్బంధంలో ఉంచేందుకు అనుమతించాలని ఒక పిటిషన్, జైలులో ప్రత్యేక గది, ఇంటి భోజనం, మందులు ఇచ్చేందుకు మరో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తున్నది. అయితే, కోర్టు తీర్పు నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టు పరిసరాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాదనల తర్వాత కోర్టు పరిసరాల్లో భారీగా బలగాలను మోహరించారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సీపీ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసు శాఖ రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించింది. ఈ మేరకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అరెస్టు నేపథ్యంలో ఏపీవ్యాప్తంగా తెలుగు దేశం శ్రేణులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టాయి.