అమరావతి : ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ మోసాలను నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు( Chandra babu ) తూచ తప్పకుండా పాటిస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila ) ఆరోపించారు. వైఎస్ జగన్కు వారసుడి ( Successor ) గా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ట్విటర్ వేదికలో విమర్శించారు.
తల్లికి వందనానికి పంగనామం- బిడ్డలకు ఎగనామం ఇదే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ హామీ అని పేర్కొన్నారు. అమ్మఒడి పేరుతో ఒక్కబిడ్డకే ఇచ్చి వైసీపీ ప్రభుత్వం తల్లులను పచ్చిమోసం చేస్తే, ఒక్కో బిడ్డకు రూ.15 వేలు అంటూ హామీ ఇచ్చి రూ.13 వేలు ఇస్తూ తల్లులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అమ్మఒడి పేరుతో మోసానికి పాల్పడ్డ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధిచెప్పి, కూటమికి పట్టం కడితే మీరు చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు.
రాష్ట్రంలో 83 లక్షల మంది బిడ్డలుంటే 67 లక్షల మందికి ఇవ్వడం ఎంతవరకు న్యాయమని, సుమారు 20 లక్షల మంది బిడ్డలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. 300 యూనిట్లు విద్యుత్, పొలాలు, కార్లు అంటూ కారణం చూపుతూ లబ్దిదారుల సంఖ్యను తగ్గించడం దారుణమని అన్నారు. నాన్న బుడ్డీని జగన్ దోచుకున్నారు సరే.. మీరు ఏకంగా బుడ్డీనే మాయం చేస్తున్నారని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.