అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చక ప్రజలపై పెనుభారం మోపేలా చర్యలు తీసుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Secretary Ramakrishna) ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సర్ఛార్జీల ( Surcharge ) పేరిట సుమారు 18 వేల కోట్ల రూపాయలు భారం మోపడాన్ని నిరసిస్తూ వామపక్షాల ( Left Parties) ఆధ్వర్యంలో ఈనెల 19న విజయవాడలో భారీ నిరసన తెలియజేస్తున్నట్లు ప్రకటించారు.
ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీ చరిత్రలో ఏనాడూ లేని విధంగా ట్రూ అప్ ఛార్జీ భారాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పెరుగుతున్న ధరలను నియంత్రించలేక పోతున్నారని విమర్శించారు.
మంత్రు ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల సామర్ద్యం తగ్గించి రూ. 25 వేల కోట్ల ఆదాయం చేసుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. పోలవరం విషయంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను చంద్రబాబు ఏపీ ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తానని చంద్రబాబు ప్రకటిస్తున్నారని వెల్లడించారు. వాస్తవానికి పోలవరం అంశంలో కేంద్రం వైఖరిని గమనిస్తే రాబోయే రోజుల్లో రాష్ట్రానికి నీటిరంగంలో ప్రమాదం సంకేతాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.