అమరావతి : ఏపీలోని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని (TDP MP Keshineni Nani) చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను త్వరలో వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు పచ్చి మోసగాడని, అందులో డౌటేమి లేదని విమర్శించారు. బుధవారం ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను తాడేపల్లి నివాసంలో భేటీ అనంతరం మీడియా సమావేశంలో చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుటుంబంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
తొమ్మిదిన్నర సంవత్సరాలలో పార్టీ కోసం ఆస్తి అమ్ముకున్నా. వ్యాపారం మానుకున్నా. సుమారు రెండువేల కోట్ల రూపాయలు నష్టపోయానని అన్నారు. పార్టీ కోసం నిజాయితీగా, ప్రాంతీయ అభివృద్ధి కోసం పాటు పడ్డానని పేర్కొన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో తనను చంద్రబాబు బూతులు తిట్టించారని దుయ్యబట్టారు. చంద్రబాబు జైల్లో ఉన్నపుడు కుటుంబానికి అండగా ఉన్నానని గుర్తు చేశారు. పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామాను స్పీకర్‌కు ఫ్యాక్స్ ద్వారా పంపిస్తానని వెల్లడించారు. ‘ పార్టీకి రాజీనామా చేశానని ప్రస్తుతం తాను ఫ్రీ బర్డ్’ అని అన్నారు.
వైఎస్ జగన్ పథకాలు బాగున్నాయి..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదల పక్షపాతిగా పని చేస్తున్నారని ఆయన చేపట్టే ప్రతి పథకం బాగున్నాయని కొనియాడారు. త్వరలో వైసీపీలో చేరనున్నానని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేనలకు 40 సీట్ల కంటే ఎక్కువ రావని జోస్యం చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ 80 శాతం ఖాళీ అవబోతుందని స్పష్టం చేశారు.