Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారితప్పింది. సాంకేతిక కారణాల కారణంగా రాంగ్రూట్లో వెళ్లిపోయింది. ఇది గమనించిన ఏటీసీ సిబ్బంది.. వెంటనే పైలట్‌ను అప్రమత్తం చేశారు. దీంతో సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నారు.
రా కదలిరా సభలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న చంద్రబాబు.. అక్కడి నుంచి అరకుకు హెలికాప్టర్లో బయల్దేరారు. హెలికాప్టర్ బయల్దేరిన కొద్దిసేటికే అందులో సాంకేతిక కారణాల వల్ల సమన్వయ లోపం తలెత్తింది. దీంతో ఏటీసీ ఇచ్చిన రూట్‌మ్యాప్ అర్థం చేసుకోవడంలో పైలట్ గందరగోళానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఒకవైపు వెళ్లాల్సిన హెలికాప్టర్‌ను మరోవైపు తీసుకెళ్లాడు. రాంగ్రూట్లో హెలికాప్టర్ వెళ్తున్నట్లు గమనించిన ఏటీసీ సిబ్బంది వెంటనే పైలట్‌ను అప్రమత్తం చేశారు. హెలికాప్టర్‌ను వెనక్కి పిలిపించి.. మళ్లీ సరైన మార్గంలో వెళ్లేందుకు అనుమతినిచ్చారు. ఏటీసీ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత హెలికాప్టర్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులోయకు సురక్షితంగా చేరుకున్నారు.