Keshineni Nani | ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. ప్రస్తుతం విజయవాడ లోక్‌సభ సభ్యుడిగా కేశినేని నానికి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇచ్చే అవకాశాలు లేవు. ఆయన సోదరుడు కేశినేని చిన్నికి టీడీపీ టికెట్ ఇవ్వనున్న నేపథ్యంలో నాని అభిమానులు ఆగ్రహించారు. విజయవాడలోని కేశినేని నాని భవన్‌కు ఉన్న టీడీపీ, చంద్రబాబు ఫ్లెక్సీలు సిబ్బంది తొలగించారు. వాటి స్థానే కేశినేని నాని, కేశినేని నాని కుమార్తె శ్వేత ఫోటోలు ఉన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
కేశినేని శ్వేత కూడా విజయవాడ నగర పాలక సంస్థ కార్పొరేటర్‌గా ఉన్నారు. ఆమె కూడా టీడీపీకి రాజీనామా చేశారు. వచ్చే ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీతోపాటు లోక్ సభ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్ సారధ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. చంద్రబాబునాయుడు సారధ్యంలోని టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు పవన్ కల్యాణ్ సారధ్యంలోని జనసేన పార్టీతో కలిసి పోటీ చేసేందుకు టీడీపీ సన్నద్ధం అవుతున్నది. కానీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం బీజేపీ మిత్ర పక్షంగా ఉండటం గమనార్హం.