ఏపీ ముఖ్యమంత్రి జగన్పై టీడీపీ అధ్యక్షుడు తీవ్రంగా మండిపడ్డారు. ప్రమాణ స్వీకారం సమయంలో విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని చెప్పి, నేడేమో 42,172 కోట్ల భారాన్ని ప్రజల నెత్తిన వేశారని చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. సీఎం జగన్ తన సొంత ఎజెండాతో వ్యవహరిస్తూ, విద్యుత్ రంగాన్ని సర్వ నాశనం చేస్తున్నారని ఆక్షేపించారు. పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు గురువారం వర్చువల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీలో ఉన్న విద్యుత్ రేట్లతో పారిశ్రామిక వేత్తలు బెంబేలెత్తిపోతున్నారని, పరిశ్రమలు కూడా ముందుకు రావడం లేదని విమర్శించారు. సంపన్న వర్గాల కోసమే వైసీపీ సర్కార్ పనిచేస్తోందని ఆరోపించారు.
జగన్ సర్కార్ ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచిందని, కరెంట్ స్విచ్ వేయాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారని చంద్రబాబు అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సోలార్ విద్యుత్తును దెబ్బతీశారని, లోటు విద్యుత్ రాష్ట్రంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హయాంలో దూర దృష్టితో విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేశామని, ఇప్పుడు జగన్ తన సొంత ఎజెండాతో నాశనం చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు.