(Polavaram Project) న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ టూర్ సక్సెస్ అయినట్లుగా కనిపిస్తున్నది. కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన రెండ్రోజుల్లోనే పోలవరంకు నిధులు మంజూరయ్యాయి. నేడో రేపో ఆ నిధులు రాష్ట్ర ఖజానాకు చేరే అవకాశాలు ఉన్నాయి. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. 2014 ఏప్రిల్ 1న కేంద్ర జల ఇంధన మంత్రిత్వ శాఖ 100 శాతం ఖర్చును తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు రూ. 320 కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉత్తర్వులు జారీ చేశారు. 2021–22 బడ్జెట్లో కేంద్ర జల ఇంధన మంత్రిత్వ శాఖకు కేటాయించిన నిధుల నుంచి పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) కి ఈ నిధులను విడుదల చేయాలని ఆదేశించారు. ఈ నిధులు ఇవాళ పీపీఏ ఖాతాలోకి, శుక్రవారం రాష్ట్ర ఖజానాకు చేరుతాయని అధికారులు తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.18,372.14 కోట్లు ఖర్చు చేసింది. వీటిలో రూ.13,641.43 కోట్లు ఏప్రిల్ 1, 2014 తర్వాత ఖర్చు చేశారు. కేంద్రం ఇప్పటివరకు రూ.11,492.16 కోట్లు తిరిగి చెల్లించగా.. రూ.2,149.27 కోట్లు బకాయి పడింది. బకాయి పడిన బిల్లులను పరిశీలిస్తున్న పీపీఏ రూ.711.60 కోట్లు రీయింబర్స్మెంట్ కోసం కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు పంపింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదంతో ఈ మొత్తాన్ని మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపింది. ఇందులో రూ.320 కోట్లను ఆర్థిక శాఖ మొదటి దశలో మంజూరు చేసింది. మిగిలిన మొత్తాన్ని మంజూరు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. తాజా మంజూరు చేసిన నిధులతో, రాష్ట్రం చేసిన ఖర్చులో కేంద్రం ఇంకా రూ.1829.27 కోట్లు బకాయి పడింది.