Urea | ఏపీకి కేంద్ర ప్రభుత్వం భారీగా యూరియాను కేటాయించింది. ఇప్పటికే రాష్ట్రంలో 80 వేల టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉండగా.. మరో 50వేల టన్నుల యూరియాను కేటాయించింది. వివిధ సంస్థల ద్వారా రెండు రోజుల్లోనే ఈ యూరియా రాష్ట్రానికి రానుందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం ఫోన్ చేసి మాట్లాడారు. తక్షణమే యూరియాను కేటాయింఆచలని కోరారు. కాకినాడ పోర్టుకు చేరుకున్న నౌక నుంచి ఏపీకి అత్యవసరంగా యూరియా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి నడ్డా.. 50 వేల టన్నుల యూరియాను కేటాయించారని అచ్చెన్నాయుడు తెలిపారు. ఆగస్టు నెలకు కేటాయించిన 82,151 టన్నులకు అదనంగా 50 వేల టన్నులు కేటాయించారని వెల్లడించారు. ఇప్పటికే రైతు సేవా కేంద్రాలకు 41,183 టన్నులు సరఫరా చేశామని, మరో 40,968 టన్నులు రవాణాలో ఉందని చెప్పారు. తక్షణ అవసరాలకు అనుగుణంగానే యూరియాను వాడాలని విజ్ఞప్తి చేశారు.
సీఎం చంద్రబాబు నేరుగా కేంద్రమంత్రితో మాట్లాడటం వల్లే ఈ యూరియా కేటాయింపు సాధ్యమైందని అచ్చెన్నాయుడు తెలిపారు. రాబోయే రబీ సీజన్‌కు కూడా రాష్ట్రానికి అవసరమైన 9.3 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేంద్రం కేటాయించిందన్నారు. కాబట్టి రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పాలని ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యూరియా సరఫరా జరిగేలా చూడాలని ఆదేశించారు. యూరియాను ఎవరైనా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.