AP News | ఏపీలో ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసింది. పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలను బదిలీ చేసింది. అలాగే ఈ మూడు జిల్లాల డీఎస్పీలపైనా కూడా ఈసీ వేటు వేసింది. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
పల్నాడు, తిరుపతి, అనంతపురం మూడు జిల్లాల్లో మొత్తం 12 మంది సబార్డినేట్లపై ఈసీ సస్పెన్షన్ విధించింది. వారిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. హింసాత్మక ఘటనలపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేసి రెండు రోజుల్లో నివేదికలు ఇవ్వాలని ఆదేశించింది. ఫలితాల వేళ కూడా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ క్రమంలోనే మరో 25 సీఆర్పీఎఫ్ కంపెనీల బలగాలను ఏపీలో మోహరించాలని ఆదేశించింది. ఓట్ల లెక్కింపు తర్వాత కూడా 15 రోజులు బలగాలను కొనసాగించాలని పేర్కొంది.