అమరావతి : విజయవాడలోని భవానీపురం ( Bhawanipuram ) లో అక్రమంగా కూల్చివేసిన ఇళ్లపై సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( YS Jagan ) డిమాండ్ చేశారు. మంగళవారం భవానీపురంలో పర్యటించి బాధితులను పరామర్శించి ఓదార్చారు. ఇళ్ల కూల్చివేత ( House demolitions ) పై సుప్రీం కోర్టు ఈనెల 31 వరకు స్టే ఇవ్వగా పోలీసులు ప్రైవేట్ వ్యక్తులకు మద్దతు తెలుపుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ 42 కుటుంబాల ఇళ్లను నేల మట్టం చేశారని ఆరోపించారు.
బాధితులున్న స్థలం 2.17 ఎకరాలను కాజేసేందుకు మంత్రి నారా లోకేష్, ఎంపీ కేశినేని చిన్ని, జనసేన కార్పొరేటర్ సోదరుడి ప్రమోయం ఉందని పేర్కొన్నారు. పేదల ఇళ్లకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి ఉందని, బ్యాంకులు సైతం ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇచ్చారని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి నాయకుల అన్యాయాలు కొనసాగుతున్నాయని,లిటికేషన్ ఉన్న భూములను అధికార పార్టీ నేతలే కబ్జా చేయిస్తున్నారని మండి పడ్డారు. ఫేక్ సొసైటీలు, భూకబ్జాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.