తిరుపతి : తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో ఈనెల 9న క్రోధినామ సంవత్సర ఉగాది (Ugadi) ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నామని టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలు (Earning Sevas) అష్టదళ పాదపర్మారాధన, కల్యాణోత్సవం. ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలను రద్దు చేసినట్లు వెల్లడించారు.
ఉగాది పర్వదినం రోజున తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం, అనంతరం శుద్థి నిర్వహణ, ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామివారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణను అర్చకులు చేస్తారని వివరించారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు విమాన ప్రాకారం, శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాల ధరింపు, అనంతరం పంచాగ శ్రవణం కార్యక్రమం జరుగుతుందని అన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న 59,321 మంది భక్తులు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 17 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని వివరించారు. నిన్న స్వామివారిని 59,321 మంది భక్తులు దర్శించుకోగా 30,073 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.68 కోట్లు వచ్చిందన్నారు.