Buggana Rajendranath | పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి ప్రధాన కారకుడు చంద్రబాబు అని మండిపడ్డారు. కుప్పం ప్రాంతానికి తానే నీళ్లు ఇచ్చానని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.
పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ధ్వంసం చేశారని బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. చంద్రబాబుకి పోలవరంపై అవగాహన లోపం ఉందని అన్నారు. కాఫర్ డ్యాం పూర్తి చేయకుండా, డయాఫ్రమ్ వాల్ ఎలా కడతారని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు మొదలుపెట్టింది మేమే అని చంద్రబాబు అంటున్నారని బుగ్గన రాజేంద్రనాథ్ వ్యాఖ్యానించారు. ఆయనకు ఇంకేం చెబుతాం.. ఆయనకు చెప్పేవాళ్లే లేరని అన్నారు. పోలవరమే కాదు.. నాగార్జున సాగర్ కూడా నేనే కట్టానని చంద్రబాబు అనేటట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి, అన్ని అనుమతులు తీసుకొచ్చింది వైఎస్ఆర్ అని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే అన్ని పనులు కలిపి ఒకే టెండర్ పెట్టారని బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. కానీ మేమే పనులు మొదలుపెట్టామని చంద్రబాబు చెబుతున్నారని.. ఆయనకు ఏం చెబుతామని విమర్శించారు. కుడి కాలువకు సంబంధించిన భూసేకరణ 2004 నుంచి 2014 మధ్యలోనే పూర్తయ్యిందని తెలిపారు. దాదాపు 3.67లక్షల ఎకరాల భూమిని సేకరించారని పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ధ్వంసం చేశారని బుగ్గన మండిపడ్డారు. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం.. పోలవరం ప్రాజెక్టు కేంద్రం బాధ్యత అని తెలిపారు. కానీ ఆ ప్రాజెక్టును చేతుల్లోకి తీసుకుని చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారని అన్నారు. 2016లో అరుణ్ జైట్లీతో చంద్రబాబు చేసిన ఒప్పందం కారణంగా చాలా నష్టపోయామని తెలిపారు. చంద్రబాబు తప్పుడు విధానాల వల్ల చాలా నష్టపోయామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కోసం వైఎస్ జగన్ అనేకసార్లు ఢిల్లీకి వెళ్లారని.. మూసిసేన ఫైల్‌ను మళ్లీ ఓపెన్ చేయించారని పేర్కొన్నారు. పోలవరంపై కనీసం అడిగే పరిస్థితుల్లో కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం లేదని విమర్శించారు. వైసీపీ హయాంలో సాధించిన డబ్బులనే పోలవరం ప్రాజెక్టుకు ఇస్తున్నారని అన్నారు.
మీరు చేసేది తప్పు అని ప్రతిపక్షంగా మేం చెబుతుంటే..ఆయనకు కోపం వస్తుందని అన్నారు. ఇప్పుడు ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని విమర్శించారు.