AP News | తనను తండ్రి అపార్థం చేసుకోవడంతో తట్టుకోలేకపోయింది ఓ కూతురు. నాన్న దృష్టిలో దోషిగా నిలబడకపోతే ప్రాణాలు తీసుకోవడమే బెటర్ అని భావించింది. నా గురించి అన్ని తెలిసిన నువ్వే నన్ను నమ్మకపోతే.. ఇంకెవరు నమ్ముతారు నాన్న అంటూ బాధతో ఓ లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. నంద్యాల జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా డోన్ పట్టణానికి చెందిన జక్కి గౌరప్ప, రామేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. వీరిలో పెద్దదైన రేణుక (22) మాచర్లలోని న్యూటన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో సీఈసీ రెండో సంవత్సరం చదువుతోంది. స్థానిక ఆంధ్రా బ్యాంకు పైనున్న కాలేజీ హాస్టల్లో ఉంటుంది. రేణుకను చెల్లెలిగా చూసుకునే తోటి విద్యార్థి ఆమెకు ఫోన్ చేశాడు. కానీ పనిలో ఉండే ఆమె కాల్ లిఫ్ట్ చేయలేదు. కంగారుపడిన సదరు విద్యార్థి రేణుక తండ్రికి ఫోన్ చేసి ఆరా తీశాడు. దీంతో ఆగ్రహానికి గురైన తండ్రి కూతురికి ఫోన్ చేసి గట్టిగా మందలించారు.
కాలేజీలో చదువుకునే అమ్మాయిలకు అబ్బాయిలతో పనేంటి? అతను ఎందుకు కాల్ చేస్తున్నాడు? ఈ విషయాన్ని కాలేజీకి వచ్చి తేలుస్తానంటూ రేణుక తండ్రి సీరియస్ అయ్యాడు. రేణుక ఎంత చెప్పినా తండ్రి వినిపించుకోలేదు. సోమవారం తెల్లారేసరికి కాలేజీకి వస్తానని చెప్పడంతో రేణుక భయపడిపోయింది. తండ్రి వస్తే ఏం అవుతుందోనని భయపడిపోయిన రేణుక.. తాను చనిపోతేనే సమస్య తీరుతుందని అనుకుంది. తాను ఏ తప్పు చేయలేదని ఉత్తరం రాసి.. హాస్టల్లో ఖాళీగా ఉన్న ఒక రూమ్‌లోని ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
నేను ఏ తప్పు చేయలేదు నాన్న. నువ్వే నా ధైర్యం.. అలాంటి నువ్వే నన్ను నమ్మకుంటే ఎవరు నమ్ముతారు అని ఆ లేఖలో రాసింది. ఆ అన్న తప్పేమీ లేదు.. అతను నన్ను అమ్మలా భావిస్తాడని కూడా రేణుక ఆ లేఖలో పేర్కొంది. ఇది చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.