AP News | చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లయిన ఐదు రోజులకే నవ వరుడు ఆకస్మికంగా కన్నుమూశాడు. అత్తగారింటికి వచ్చిన అల్లుడు అస్వస్థతగా ఉందని ఆస్పత్రికి వెళ్లగా.. అక్కడే చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని వెంగసంద్రాకు చెందిన కార్తీక్ (28) అనే యువకుడికి చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కొల్లుపల్లికి చెందిన భవానీతో ఐదు రోజుల కిందట వివాహం జరిగింది. పెళ్లితంతు పూర్తయిన తర్వాత బంధువులు అందరూ ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. పెళ్లయిన ఐదోరోజు కార్తిక్ తన భార్యను తీసుకుని అత్తగారింటికి వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత కార్తీక్ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో భార్యను తీసుకుని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు క్లినిక్కు వెళ్లాడు. అక్కడే చికిత్స పొందుతూ మరణించాడు.
గుండెపోటు కారణంగా కార్తీక్ చనిపోయాడని పలువురు అనుమానిస్తున్నారు. అయితే కార్తీక్ మరణవార్త తెలుసుకుని అతని కుటుంబసభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే, అతనికి కేవలం గ్యాస్ట్రిక్తో ఇబ్బంది పడ్డారని. కానీ వైద్యులు సరైన వైద్యం అందించలేదని చనిపోయాడని ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.