తిరుమల : తిరుమలలో ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలు ( Tirumala Brahmotsavam ) సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగనున్నాయని టీటీడీ ( TTD ) ఈవో జె. శ్యామలారావు తెలిపారు. అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణలతో కలిసి సోమవారం అన్నమయ్య భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 24న బ్రహ్మోత్సవాల తొలి రోజు పట్టు వస్త్రాలను సమర్పిస్తారని వివరించారు. సెప్టెంబర్ 28న గరుడ సేవ( Garuda Seva ), అక్టోబర్ 2న చక్రస్నానం కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చే రద్దీని ముందుగా అంచనా వేసి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు.
అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహన రాకపోకలను అంచనా వేసేందుకు టెక్నాలజీ సాయం తీసుకోవాలని సూచించారు. ఎక్కువమంది భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆలయం, గ్యాలరీల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో జిల్లా పోలీసులతో సమన్వయంతో భద్రత, బందోబస్తు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈవో సూచించారు. తిరుమలలో పార్కింగ్ స్థలాలను ఎంపిక చేసి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో టీటీడీ ఎఫ్ఏ అండ్ సీఏవో బాలాజీ, సీఈ సత్యనారాయణ, ఏపీఎస్ ఆర్టీసీ ఆర్ఎం జగదీష్, ఇతర టీటీడీ, పోలీసు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.